Echoes- మాయమైన సంతోషం
మా అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న భవాని నిన్న సాయంత్రం వచ్చి రాఖీ కట్టింది, గిఫ్ట్‌గా తనకు సల్మాన్ రష్దీ రాసిన "మిడ్‌నైట్స్ చిల్రన్" నవల ఇచ్చాను. "థ్యాంక్స్. నాకో ఫేవర్ చేస్తావా?" అని అడిగింది. ఒక్క క్షణం ఆలోచించి "ప్రామిస్ చేయలేను" అన్నాను. తను చిన్నగా నవ్వి "నా కథ చెప్తా, రాస్తావా?" అంది. ఏ మాత్రం ఆలోచించకుండా "ష్యూర్" అని పాజ్‌లో ఉన్న "డార్క్ డిజైర్" సీజన్ టూ సిరీస్ అఫ్ చేసేసాను. భవానీ చెప్పటం మొదలు పెట్టింది.
****
మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. కిరణ్ ఓ కన్స్‌ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్. నేను సాప్ట్‌వేర్ కంపెనీలో అకౌంటెంట్‌గా జాబ్ చేస్తున్నాను. మా ఎంగేజ్మెంట్ జరిగాక పెళ్ళికి నాలుగు నెలల గ్యాప్ ఉండడంతో ఒకరినొకరు అర్ధం చేసుకునే అవకాశం దొరికింది. మొదట్లో అతని దగ్గర నాకు లోపాలేం కనిపించలేదు. కానీ పెళ్లయిపోయాక ఒకే కప్పు కింద కలిసి బ్రతకటం మొదలుపెట్టాక ఒకరి లోపాలు ఇంకొకరికి కనిపించసాగాయి. అతను పొద్దున్నే వెళ్ళాలి కాబట్టి నేను ఆరింటికే లేవాల్సి వచ్చేది, చాలా చిరాకు అనిపించేది. మొదట్లో బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే రెడీ చేసే దాన్ని, కొన్నాళ్ళకి "క్యాంటీన్ ఫుడ్ బావుండట్లేదు లంచ్ బాక్స్ కట్టు" అన్నాడు. సో, ఆరు కాస్తా ఐదైంది. "మళ్ళీ వచ్చే జన్మంటూ ఉంటే మగాడిలా పుట్టాలి" అని అనుకోని క్షణం లేదు. నేను చాలా పద్దతిగా పెరగడం వల్లే అనుకుంటా కిరణ్ చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా నాకు చాలా కోపం తెప్పించేవి. స్నానం చేసాక ఒళ్ళు తుడుచుకుని టవల్ మంచం మీద లేదు చైర్‌లో వేసే వాడు, సాక్స్ విప్పాక ఎక్కడెక్కడో పడేసేవాడు. ఎన్ని సార్లు చెప్పినా వినే వాడు కాదు. సినిమా చూస్తున్నప్పుడు హీరోయిన్ గురించి మాట్లాడుతూ "అదీ" "ఇదీ" అనే వాడు. నాకు చాలా చిరాకు వచ్చేది. ఉదయం ఎనిమిదింటికి వెళ్తే రాత్రి ఎనిమిదింటికి తిరిగి వచ్చే వాడు, కొన్ని సార్లు పది కూడా అయ్యేది. "ఇదేం జాబ్ కిరణ్!" అన్నాను ఒకసారి. "సివిల్ ఇంజనీర్ల జీవితాలు ఇంతే" అనేవాడు. పెళ్ళైన రెండో ఏడుకి కన్సీవ్ అయ్యాను. అమ్మ వచ్చి నన్ను తీసుకెళ్లింది. అమ్మ దగ్గర ఉన్నన్ని రోజులూ నన్ను చూడటానికి కిరణ్ రాలేదు. "ఏమైంది?" అని అడిగితే అర్జంట్ వర్క్ అంటాడు లేదా కాంక్రీట్ ఉంది అంటాడు. నాకా ఇంజనీరింగ్ లాంగ్వేజ్ అస్సలు అర్థమయ్యేది కాదు. చాలా సార్లు "పాపం సివిల్ ఇంజనీర్లు!" అని జాలి పడే దాన్ని. డెలివరీ అయ్యాక బాబుని తీసుకొని తిరిగి ఇంటికొచ్చాక "వేరే జాబ్ చూసుకో" అని కిరణ్‌తో చెప్పాను. "బయట మార్కెట్ పరిస్థితి బాలేదు" అన్నాడు. బాబు నాకు పెద్ద బాధ్యత అయిపోయాడు. ఉదయం డే కేర్ దగ్గర వదిలి వెళ్లేదాన్ని అండ్ ఆఫీస్ నుంచి రిటర్న్ అయినప్పుడు పికప్ చేసుకునే దాన్ని. అత్తయ్య వైపు నుంచి ఎవరూ రాలేకపోయారు. అమ్మ వచ్చి కొన్నాళ్ళు సాయంగా ఉంది. ఊర్లో నాన్న, తమ్ముడికి ఇబ్బంది అవడంతో తిరిగి వెళ్ళిపోయింది. ఇంటి పనులకు మెయిడ్‌ని పెట్టుకున్నాం. బాబు హెల్దీగా ఉండటం నాకు చాలా ఊరటనిచ్చింది. అదే సమయంలో మెల్లగా కిరణ్‌లో నిర్లక్ష్యం మొదలైంది. బాబు, ఇల్లు నా ఒక్కదాని బాధ్యతే అన్నట్టు ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆర్థికపరమైన విషయాలు డిస్కస్ చేయటం మానేశాడు.
"నాకు చెప్పకుండా మీ అక్క కోసం ఐదు లక్షలు లోన్ తీసుకున్నావా?" అని అడగ్గానే నా వైపు చూసి "ఓహో! అన్నీ నీకు చెప్పే చేయాలా?" అన్నాడు వెటకారంగా. "బాబు ఎదుగుతున్నాడు. వచ్చే సంవత్సరం నర్సరీలో వేయాలి. మన ఇంటి డిజైన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మనం కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోకపోతే కష్టమవుతుందని చెప్పటమే నా ఉద్దేశ్యం" అని కాఫీ కప్ అందించాను. "సిక్స్ మంత్స్‌లో బావ రిటర్న్ చేస్తా అన్నాడు. సో.." అని ఆగిపోయాడు. "కిరణ్, వాళ్లకు డబ్బులు సర్దటం తప్పు కాదు, బట్ మన సిట్యుయేషన్ కూడా ఆలోచించాల్సింది" అని లేచి వెళ్లిపోయాను.
ఓ రోజు సాయంత్రం "ఎవర్ని అడిగి ష్యూరిటీ సంతకం పెట్టావ్?" ఇంటికొచ్చిన బ్యాంక్ నోటీస్ పేపర్ చేతిలో పట్టుకుని కిరణ్‌ని నిలదీసాను. అటూ ఇటూ దిక్కులు చూస్తూ నిలబడ్డాడు. "అసలు నీకు బ్రెయిన్ పనిచేస్తోందా?" అని అడిగితే "నువ్వు ఎవరికీ సంతకం పెట్టలేదా? మీ ఫ్రెండ్ స్వప్న కోసం పెట్టావు కదా! 'అది' మంచిది కాబట్టి నీకు సమస్యలు రాలేదు. వీడు వెధవ కాబట్టి నీ దగ్గర మాటలు పడుతున్నాను" అని విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. మా గొడవ వల్ల బాబు ఏడుపు స్టార్ట్ చేసాడు. రకరకాల ఆలోచనలు నన్ను చుట్టుముట్ట సాగాయి. "ఇదేనా లైఫ్ అంటే? ఈ మగాళ్ళందరికీ తాము చాలా తెలివైన వాళ్ళమని వాళ్ళ ఫీలింగ్. ఎవరైనా కొంచెం పొగిడితే చాలు ఏం చేయటానికైనా వెనుకాడరు" అనుకుంటూ నిద్రపోయాను. కానీ మరో బాంబ్ పేలటానికి సిద్ధంగా ఉందని నాకప్పుడు తెలియదు.
******
ఉదయం ఆఫీస్‌కి బయలుదేరుతూ "కిరణ్, సాయంత్రం బాబుని డే కేర్ నుంచి పికప్ చేసుకో. నాకు లేట్ అవ్వొచ్చు, ప్లీజ్" అని అడిగాను. వెంటనే "సరే" అన్నాడు. ఆ రోజు నేను ఇంటికొచ్చేసరికి రాత్రి తొమ్మిదైంది. ఇంట్లో ఎవరూ లేరు, బాబు ఎక్కడ!? వెంటనే డే కేర్‌కి కాల్ చేస్తే నో రెస్పాన్స్. కిరణ్‌కి కాల్ చేస్తే బిజీ వస్తోంది. లేట్ చేయకుండా స్కూటీ తీసుకుని డే కేర్‌కి బయలుదేరాను. సన్నగా చినుకులు కూడా మొదలయ్యాయి. "ఎవరూ లేరమ్మా, అందరూ సాయంత్రమే వెళ్ళిపోయారు" అని వాచ్ మాన్ చెప్పడంతో ఒక్కసారిగా నా గుండె ఆగినంత పనైంది. కిరణ్ కాల్ అటెండ్ చేయట్లేదు. నా భయం ఇంకా ఎక్కువైంది. "నా బాబు ఎక్కడున్నాడు, ఏమైపోయాడు?" అన్న ఆలోచనతో తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి. రోడ్డు మీద వెళ్తున్న జనం నా వైపు ఆశ్చర్యంగా చూడటం గమనించి అక్కడ్నుంచి బయలుదేరాను. ఇంటికొచ్చి మెట్ల మీద కూర్చున్నాను. ఇంతలో కిరణ్ వచ్చేడు. పరిగెత్తుకుని వెళ్లి "బాబు కనిపించటం లేదు" అని అతన్ని పట్టుకుని నేను ఏడుస్తోంటే "ఏమైంది?" అన్నాడు. "బాబు డే కేర్‌లో లేడు" అన్నాను. "సారీ, నేను వర్క్‌లో పడి మర్చిపోయాను" అన్నాడు. "ఛీ" అని కళ్ళు తుడుచుకుని పోలీస్ స్టేషన్‌కి బయలుదేరాను. "ఆగు భవాని" అని కిరణ్ పిలుస్తున్నా పట్టించుకోకుండా టూ వీలర్ స్టార్ట్ చేసాను. "వేరే నంబర్స్ లేవా డే కేర్ వాళ్ళవి?" అని అడిగాడు ఎస్సై. "లేవు సర్, ఇదొక్కటే ఉంది" అన్నాను. అతను చిన్నగా నిట్టూర్చి "సరే, టీ తాగండి. డీటైల్స్ మా కానిస్టేబుల్ కనుక్కుంటాడు. మీరు కంగారుపడకండి" అని కానిస్టేబుల్‌ని పిలిచి అతనికి వివరాలు చెప్పాడు. "ఇక మీరు ఇంటికి వెళ్ళండి మేడమ్, ఏం పర్లేదు మేము చూసుకుంటాం" అన్నాడు ఎస్సై. ఖాళీ టీ కప్ టేబుల్ మీద పెట్టి "థాంక్యూ సర్" అని నిరాశగా లేచాను. "సినిమాల్లో పోలీసులను చూసీ చూసి వాళ్ళంటే ఏదో తెలియని భయం, బెరుకు ఉండేవి. బట్ వాస్తవానికి పోలీసులందరూ చెడ్డోళ్ళేం కాదు" అనుకుంటూ ఇంటికి బయలుదేరుతుంటే కిరణ్ ఎదురుపడ్డాడు. "కంప్లైంట్ ఇచ్చాను, ఇంటికి పద" అన్నాను. నా వైపు చూడటానికి కూడా భయపడుతున్నాడని అర్థమైంది. ఇంటికి చేరుకుని నీరసంగా సోఫాలో కూలబడ్డాను. కిరణ్ కాఫీ పెట్టి తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంతలో నా ఫోన్ మోగింది. వెంటనే అటెండ్ చేసి "హలో" అన్నాను ఆతృతగా. "మేడమ్, బాబు దొరికాడు, స్టేషన్‌కి రండి" అని అటు నుంచి ఎస్సై చెప్పగానే పోయిన ప్రాణాలు తిరిగొచ్చాయి. కిరణ్ వైపు చూసి "బాబు దొరికాడు" అని బయటకు పరుగు తీసాను. మేము వెళ్లే సరికి లేడీ కానిస్టేబుల్ బాబుని ఎత్తుకుని ఆడిస్తోంది. బాబుని అందుకుని ఏడుస్తూ ముద్దు పెడుతుంటే నా మెడ చుట్టూ చేతులేసి నా బుగ్గ మీద ముద్దు పెట్టాడు. "కూర్చోండి" అన్నాడు ఎస్సై. మెల్లగా తేరుకుని కూర్చున్నాక "కొందరు బీహారీలు బాబుని కిడ్నాప్ చేశారు. సీసీ కెమెరాల సాయంతో త్వరగా పట్టుకోగలిగాం. ఇక్కడ ఒక సంతకం పెట్టి మీరు బయలుదేరండి" అన్నాడు చాలా మర్యాదగా. ఎదురుగా ఉన్న కాగితాల మీద సంతకం చేశాను. "థాంక్యూ వెరీ మచ్ సర్" అని కిరణ్ పర్స్ నుంచి డబ్బులు తీసి ఎస్సైకి ఇవ్వబోయాడు. "తెలుగు సినిమాలు బాగా చూస్తారా?" అన్నాడతను సీరియస్‌గా. ఓ వారం గడిచాక కిరణ్‌కి కాల్ చేసి "కొంచెం మాట్లాడాలి, ఇంటికి రా" అన్నాను. ఆ రోజు ఎర్లీగా వచ్చాడు. నేను డివోర్స్ గురించి చెప్పగానే "ఏం మాట్లాడుతున్నావు!?" అని బిగ్గరగా అరిచాడు. నేనే మాత్రం తొట్రుపాటు లేకుండా "యెస్, నాకు విడాకులు కావాలి" అన్నాను. "భవానీ, నేను చేసింది పొరపాటే.." అన్నాడు. వెంటనే నేను "షటప్ కిరణ్, ప్లీజ్ షటప్. ఒక్క సారి కాదు, రెండు సార్లు బాబు విషయంలో తప్పు చేశావ్. నువ్వు తాగుబోతువో, తిరుగుబోతువో అయ్యుంటే ఎలాగోలా భరించేదాన్ని. బట్ నువ్వొక ఇర్రెస్పాన్సిబుల్ ఇడియట్‌వి. చాలా సార్లు నీ ప్రవర్తనకు విసుగొచ్చినా, బాబు కోసం భరిస్తూ వచ్చాను" అన్నాను. ఇంతలో నా ఫోన్ మోగింది. "హలో" అని నేను అనగానే "కిరణ్ గారు.." అని అటు నుంచి ఎవరో మగగొంతు. "రాంగ్ నంబర్" అని కట్ చేసాను. కిరణ్ వైపు తిరిగి "నీకు బ్యాంక్ నుంచి వచ్చే కాల్స్ నువు బ్లాక్ చేశావ్, వాళ్ళు నాకు కాల్ చేస్తున్నారు. ఇనఫ్ కిరణ్. నా వల్ల కాదు" అని బట్టలు సర్దసాగాను. "నా మాట విను ప్లీజ్. ఇంకెప్పుడూ ఇలా జరగదు" అని నా చేయి పట్టుకున్నాడు, నేను సీరియస్‌గా చూసే సరికి చేయి వదిలేశాడు. "ఇంకోసారి అల్లుడితో మాట్లాడకూడదూ" కాఫీ ఇస్తూ అంది అమ్మ. "లేదమ్మా, అతనితో నాలుగేళ్లు కలిసి ఉండటమే గొప్ప. మందు, సిగరెట్ లాంటి చెడు అలవాట్లు లేని వాళ్ళందరూ మంచోళ్ళని అనుకోవటం తప్పని అర్థమైంది" అన్నాను. అమ్మ దీర్ఘంగా నిట్టూర్చింది. "ఏ స్త్రీ అయినా తన జీవిత భాగస్వామి రెస్పాన్స్‌బుల్‌గా ఉండాలని కోరుకుంటుంది, అతని నుంచి కొంచెం గౌరవం, ప్రేమ ఆశిస్తుంది. ఈ విషయం మగవాళ్లకు ఎప్పటికి అర్ధం అవుతుందో?" అనుకుంటూ తెలిసిన లాయర్‌కి కాల్ చేశాను.
The end!


Comments
Post a Comment